కాలజ్ఞాన ద్విపద
కావింప దూతల కపిలుడేతెంచి
హోమంబు గావింప హోమగుండంబు
భీమ దేశంబున పెడబొబ్బ లిడుచు
జనుదేర నొక నిశాచరుని బుట్టించి
మనుజుల భక్షింపు మని వాని పనుప
భాద్రపదంబున పడమటి దిశను
రౌద్రవేగంబున రహిని వసించి
పడమటి కరుదేర ప్రజలు భీతిల్ల
వడకుచు జనుదేర వరణుండు చూచి
యువరోషమునను నత్యుగ్రత దనర
తవిలి హోమము చేయ దనర గుండమున
ముప్పది రెండు మోముల శక్తి పుట్టి
మది నల్గి యాశ్వీజ మాసంబునందు
చదురుగా నామీద శని సప్తమంబు
వీక్షించి దేవతావిభుడు మానవులు
భక్షించి దేవతావిభుడు మానవుల
భక్షింపు మని పంపు నటురౌద్రలీల
మేటిజీవుల బట్టి మ్రింగ నూహింప
గాటంబుగాను యుగాంతమై తోచె
చటులమై వృశ్చిక సంక్రాంతియందు
చటుల తత్కాంచి వక్షంబున చేర్చి
వరుణ దేవుని జూచి వసుధేశు డనియె
గురుతుగా లింగాల కొండకు పోయి
కడమ భైరవునితో క్రమ మెల్ల దెలిపి
పనిబూని దానవియను సమకాల
శక్తి పశ్చిమదిశ బంప
భక్తి దప్పక స్వామి పనులు గావింపు
మని నీవు చెప్పిన నావిధం బంత
మనమున దలచగ మా శరణమున
వలనొప్ప గర్వించి వాడున్న జూచి
తల ద్రుంచి యాధ్వజస్తంభంబునందు
గట్టి, ఫలమ్ముగ కడు వరణుండు
పట్టుగా చని కాలభైరవుతోడ
గట్టిగా నెరిగించి కాదంటి వేని
మనమున వీరధర్మజు పాదమాన
నిను సంహరించెద నిజమని పలుక
వరుణ దేవుండుగ్ర వాక్యంబులకును
వెరచి మీరలు సెల విచ్చిన యట్లు
గావింతు నన సమకాలశక్తియును
వేవేగ దా సెల విచ్చిన నదియు
నట దక్షిణంబుల కరిగి భూసురుల
మకర కుంభంబుల మాసంబులందు
కకవికలను మహాకల్పాంత మయ్యె
పడియేడ్చు మానవుల్ భ్రమయు మానవులు
కడు నేల బడి దుమ్ము గరచు మానవులు
బెదరు మానవులు తబ్బిబ్బు మాటలను
పదరు మానవులు జీవంబులు విడిచి
తలగు మానవులు చిత్తంబుల నొంది
పలవించు మానవుల్ పలువిధంబులను
గుండెలు వ్రక్కలై గూలు మానవులు
తడయక పెదవులు తడుపు మానవులు
మరి భక్తజనముల మందిరంబులకు
శరణార్థులగుచును జనెడి మానవులును
కవవే దయనని కరుణ రక్షింప
తీవరంబుగ నోరు దెరచు మానవులు
విశ్వమంతయు మహాభీతిని బొంది
తహతహపాటున తల్లడించుచును
ఏడి నారాయణుం డేడి రక్షకుడు
ఏడి రాజోత్తము డేడి సామంతు
డేడి సంక్రందనుం డేడి గురుండు
శివు డేడి మనలను చేరి రక్షింప
ఎం దున్నవాడొకో యెవ్వరు దిక్కు
కందళితానందకరుడైన శౌరి
రామధర్మజులకు రాదయ్యె కరుణ
దీమసంబు వరుణ దేవుండు మనకు
ఇచ్చిన అభయంబు ఎక్కడ పోయె
చచ్చిన మీదట సౌఖ్యంబు లేల
కుశలవక్ష్మాపాలకుడు మహాత్ముండు
విశదంబుగా మమ్ము నేలు నటంచు
ఆశతో నుంటిమి అయ్యయో నేడు
ఆశలన్నియును నిరాశలై పోయె
సురపతి మము దయజూడలే దయ్యె
మరచి యున్నడొకొ మనయువరాజు
వీరధర్మజు దయావృత్త మెం దరిగె
కారణ మేగతి కాగల దొక్కొ
అని భక్తవీరు లున్నతి భీతినొంది
ఎనయంగ చింతించుచున్న యత్తఱిని
వినరావొ భక్తుల విన్నపంబులును
శక్తి యుపద్రవ జాడల ప్రజలు
యుక్తి దప్పిన రీతి నున్నారు నేడు
మన సురపతియైన మర్యాద లుండ
వని మీకు దెల్పెద నవుర బాగాయె
శాశ్వతం బైనట్టి సకల కర్యములు
అశ్వని గూడి వా డన్నియు మఱచె
చెండార్చి శమనుండు సతులతో గూడి
గండెక్కి యున్నాడు కడగి మీ సొమ్ము
అప్పడంబుల రీతి నారగించుటకు
ఒప్పియుండినవాడు వరుణ దేవుండు
వాయుకుబేరుండు వామదేవుండు
న్యాయంబు దప్పి యున్నారు సెబాసు
ప్రభువు కార్యము తేటపడ జేయువారు
విభవత్వ మిదియని విని నృపాలుండు
గడ గడ వణకి యా కపిలమునీంద్రు
నడుగగా పైబడి యభినుతి చేయ
కరుణించి రాజును కౌగిట జేర్చి
ఎఱిగింతు రాజేంద్ర యీసురపతిని
భక్తుల రక్షింప బనువు మీక్షణము
శక్తి కాములు నౌచు సడలింపవలెను
అనుచు రాజేంద్రుని యధిపతి బిలిచి
పనువుము వరుణుని పశ్చిమంబునకు
సేనాధిపతిని దక్షిణభూమి కనుపు
పనితంబుగను సుమంతుని పూర్వదిశకు
ఉరికింపు వాయువు నుత్తరమునకు
విశదంబు సెలవిచ్చి వీడైన పంపు
తీవ్రంబునను మధ్య దేశంబునకును
నీవును నేను నీకపిలుండు స్వామి
వార లందఱును పోవలె నని చెప్పి
పంపిన యప్పుడు పిలిచి వారలను
కనకాంబరంబులు ఘనరథం బొసగి
చను మన్న రాజుకు సద్భక్తి మ్రొక్కి
రామధర్ములు కృపారసమున జనిరి
ప్రమదంబుతో సంధిపాటిల్ల నంత
అతిశయ మేషసంగతి క్రౌంచపక్ష
మది ప్రమదంబుతో ననుకూలమైన
సరవి నుత్తరమున సాగె నాపదలు
తారలు మూడు సందర్భించె నంత
భారమై యుత్తరభాగంబునందు
ప్రకటగోదావరి పర్యంతభూమి
వికటమై విపరీతవృత్తులు పొడమి
ఒక్కొక్క తిథియందు నొక్కొక్కకోటి
నుక్కణగును తొలి యుగ్రరాక్షసులు
ఆ రెండు కలియుగ మన్యోన్యకలహ
క్రూర స్వభావులై కూలెడి విధము
విషవాతములచేత విపరీతగతుల
విషయ వాంఛల చేత విపరీతగతుల
విషయవాంఛలచేత వెరచి యెల్లెడల
మొదటి రాక్షసు లంక మూడు దిక్కులకు
పదియారుకోట్లు ఏబది రెండు వేలు
పదిమహాఖర్వముల్ పదియు పద్మములు
మూడు ఆక్షౌహిణుల్ మూడారునూర్లు
లక్షయేబది భక్షింప నొక్క
గడియలో చూర్ణమై కడు కృష్ణదాక
మడియుదు రావేళ మాధవుండరిగి
ఇదె మంచివేళ నీ వేగు మటన్న
కదియుచు బడబాగ్ని కడగి పెల్లార్చి
పాంచాననోద్భూత పావకజ్వాల
లంచిత దశదిశలందున బర్వ
పృథులదంష్ట్రాభీల భీకరార్భటులు
పృథి వెల్ల గప్ప నభేద్యమై తనర
శతయోజనములు విశాలమై రుచుల
స్థితి గాంచు గడు దీర్ఘసింహ మల్లార్చి
కణగి దిగ్గనలేచి గర్జించి మించి
కమలాకళత్ర లోకైకరక్షకుడ
తెర గేది యన నాదిదేవు డిట్లనియె
గరగరి రాక్షస గణముల నొడిసి
పురములు పల్లెలు భూరిదుర్గములు
వరుస సంకరజాతి వర్ణ సంతతుల
లోకులు పదునాల్గు లోకంబులందు
సకలచరాచరజంతుసంతతుల
కకవికలై దుమ్ము గర్వగ తాను
దండించి ఖండించి తల లుత్తరించి
గుండెలు పగిలించి గుడ్లను పొడిచి
చెండాడు మని యాదిశక్తికి దెలిపి
పుండరీకాక్షు డప్పుడు ఇట్టు లనియె
బలపడి జీవుల భక్షించు నెడను
తలవక మద్భక్తతతుల నొక్కరిని
నైన భక్షించిన నపుడె నీ తలలు
మానుగా ఖండించు మా కుమారుండు
గాన రాజేంద్రుని గని పంపు వడసి
పూని యెక్కడికైన పొమ్ము నిక్కంబు
రాజును మఱి యువరాజును గాంచి
మా జయవార్తలు మావారితోడ
తెల్పు వైశాఖంబు తెగిపోక మున్నె
మలయుచునై యష్టమంత్రుల గాంచి
తొలుత నీవార్తలు తోడ్తోన చెప్పి
మావారు చెప్పిన మర్యాదచొప్పు
త్రోవ దప్పక పెడదోయి రాక్షసుల
సకలజీవుల నొక్క జాములోవలను
వికలంబుగా నీవు విరిచి భక్షింపు
ఏ జాతి వారైన నెవరైన గాని
ఏ జాడ వారైన నేర్పడ జూచి
భక్త సంతతి పరంపరల బోనిమ్ము
భక్తులు గానట్టి పలుగాకి జనులు
వసియింప వలదింక వైళంబ పొమ్ము
కాంచీపురము దాక గైకొను పొమ్ము
పొమ్మని విష్ణువు భువనరక్షకుడు
తుమ్మరపురవీరదుర్గి కిట్లనియె
నీవు నీ సేనతో నీవేళ గదిలి
అలవారణాసిపర్యంత భూములను
కడువడి వేగ దిగంబరత్వమున
దడయక భువి నెల్ల స్థలముల వెదకి
బదరికాశ్రమ భూమి పరికించి యవల
యదధిపర్యంతంబు నున్న జీవులను
గడియకు పదికోట్లు కబళించి పేర్చి
గడియగడియ కట్లు గావింపు పొమ్ము
పగల నీతడవేల పదపద తూర్పు
బెగడొంద నెల్లూరు భేదింప వలయు
భాద్రపదంబున భద్ర నీవింక
రౌద్ర మేర్పడగ శ్రీరంగ పట్నమ్ము
సప్త ఘటంబుల సప్త దేశముల
ప్రాంతపు దేశాల బందరు దాక
అటుమీద దేశంబు లరసి పోనీక
కుటిలుల ఖండించి కొండల పొడవు
గన మొండెములు తోళ్ళు గావింపు మనియె
నంత సంవత్సరం బరిగిన లక్ష్మి
కాంతుండు నూహించి గరిమతో నపుడు
వరకుమారుని జూచి వైకుంఠు డనియె
పలుసంధి శంకింప వలవదు మనము
జయము చేకూడె నాశ్చర్యంబు గాదు
కేశవస్వామితో లెరిగించి
భాసిల్లు నీప్రియభార్యల నునిచి
రాజన్య పుత్ర మిత్రాదుల తోడ
రాజితంబుగ యువరాజు మెప్పించి
పొలుచు దత్తాత్రేయమునివద్ద కరిగి
కపిలమహాముని గాంచి వసిష్ఠ
విపుల విశ్వామిత్రవిభునితో నచట
భోరున పదికోట్ల మునులతో గూడి
హోమంబు గావింప హోమకుండమున
కామేశ్వరియు బుట్టు గగనంబు నిండ
పెళపెళ నార్చుచు బేతాళ సమితి
కదియంగ నుదయించు కపిలునివలన
సెలవు గైకొని పంపు శక్తియోగమున
తలప ఘొటకపర్వతంబుల దాక
నొకనాటిరాత్రి నత్యుగ్రంబుగాగ
ఖలులను భక్షింపు గాసి పొందెదరు
భక్తగణంబుల పటుధర్మపరుల
బలభద్రుడనువాని బాడబపురికి
నంపు మువ్వరసేను డనువాని పిలిచి
పంపుమీ లంకలోపల సమీపమున
ఆ పరోక్షుడు చన నట తూర్పుదిశకు
కోపించి దైత్యుండు కుల్పు డన్వాడు
పదికోట్ల భటులతో వచ్చి రౌద్రమున
కదనంబునకు నగ్నికణములు దొరగ
సేనాధిపతిదెస చెచ్చర జూచి
సేనల నడిపించి చెలగి ముంగలను
ఆదుష్టదైత్యుల నందఱ బట్టి
నొక్కని పోనీక నుగ్రరాక్షసుల
చెక్కు చెక్కున దున్నె చెలగి కుల్పుండు
తలచూప వెరచి యుద్ధతి బారి పోయె
పొలుపుగ తారాధిపునివైపు చేరె
ఆపరోక్షుడు వెస నపరాంబుధి దెస
నేపున బరతెంచి యేగుట చూచి
ముదమొప్ప భృగుమహాముని సంతసించి
వదలక అక్షయ బాణ తూణీర
వజ్రకవచములు ప్రముఖాయుధములు
కనకకుండలములు గణుతించి పిదప
వనితామణిని హేమావతియనుదాని
కులశీలముల నొప్పకూతు నొసంగి
వెలయంగ మామనువీడ్కొని కదలి
రాజసన్నిధి కేగి రహి పరోక్షుండు
రాజు సంతసమొంద రత్నాంబరములు
నొసగె దత్తత్రేయు డురుసంభ్రమమున
కుసుమాంగియను దాని కూతు నొసంగి
యారాజమౌళియు ఆ కపిలుండు
భూరి రత్నాంబరంబులు కట్న మొసగె
భద్రావతి యనంగ పరమ కల్యాణి
భద్రలక్షణములు పరిగిన సుతకు
నపుడె పెండిలి జేసి యలరిన గదిసి
కృషి మీరగ పుష్పగిరికి నేతించి
మహిమీద నాషాడమాస మేతేర
బహుజీవకోటికి బాధ మెండాయె
పిడుగు లద్భుతశక్తి పృథివిసై దొరగె
జటుల భంగిమను రాజన్యుల గదిసి
కలహించి యన్యోన్యకదనరంగమున
బొరసి సర్పంబు నిర్మూలనం బయ్యె
వసుధపై నెత్తురు వర్షముల్ కురియు
కసిబిసిగా ప్రజల్ గాసి చెందంగ
అంతకు నంతకు నయ్యె మిక్కుటము
వావివరుస దప్పివాదముల్ బలిసి
పిలిపించు భక్తుల ప్రేమ బుట్టించి
అబ్జాక్షు సన్నిధి కరుగంగవలయు
వలవ దాలస్యంబు వలదు నిక్కంబు
ధరమీద శుభముహూర్తము రేపు గలదు
జనపతి యంత వైశాఖమాసమున
చనె సైన్యములతోడ శౌరి సన్నిధికి
చని యువరాజుతో సకల మంత్రులును
తనరంగ సాష్టాంగ దండప్రణామ
మొనరించి సద్భక్తి నొగి సన్నుతింప
వనజలోచను డంత మనుమయత్వష్టృ
శిల్పిదైవజ్ఞులు చేరి సేవింప
వేడ్కతో మునివరుల్ విబుధులు సడువ
పనిబూని చతురంగబలములు గొలువ
ఘనపర్వతములు నక్కజముగా డిగ్గ
దుందుభికాహళతూర్యనాదములు
అందంద మ్రోయ రయంబున గదలి
అక్కడక్కడ భక్తు లరుదెంచి మ్రొక్క
గ్రక్కున వారల కరుణించి దివ్య
దినకరశతకోటిదేదీప్యమాన
ఘనఘోటకము నెక్కి ఖడ్గంబు బూని
వీరధర్మజు లంత వేంచేయు నపుడు
శౌరి కుమారుండు సన్నిధి చేరి
కొమరొప్ప ముత్యాలగొడు గొప్ప బట్టి
ప్రమదంబుతో యువరాజు చామరము
వీవ దేవేంద్రుండు విమలగాంగేయ
ఠీవి రత్నము సురటియు బట్టి నడువ
ననలుండు పాదుక లందంద నీయ
దినకరసుతు డంత దివ్యాంబరములు
గొనితేర నందంద కోణపు డతుల
పాదుకల్ రయముగా బట్టియు నడువ
ననిలుండు పార్వ్శంబు నందంద చదువ
ప్రతిలేని భక్తితో వరుణు డత్తఱిని
నడపంబు బట్టి మన్నన మీరి నడువ
నుపరివేళల పవనుండును గొలువ
చనుదేర ధనదుండు చండకోదండ
మును దాల్చి ముందర మును మిడి నడువ
ఘనగదాదండ మక్కజముగ దాల్చి
వెనుక నీశానుండు వేడ్కతో నడువ
ముంగల నిరుపార్శ్వములు నడువంగ
కపిలు డాదిగ మునిగణము లందంద
విపుల భక్తిని నంత వేదముల్ చదువ
మనుమయాదులు కాలమర్మ సంగతులు
గణుతింప నాళీకగర్భు డవేళ్ళ
బహుశాస్త్రపద్ధతుల్ పలుమారు దలప
తానెమ్మినెక్కి సేనానియు రాగ
అతులమౌ ప్రీతి వాద్యధరాదులునుగ
వాద్య సంగీతంబు లింపుగా పాడ
తడయ కరుంధతి తరలాక్షు లంత
నలరెడు మంగళహారతు లీయ
వందిబృందంబు కైవారంబు సేయ
సందడి జడియుగా స్వామి హెచ్చరిక
యనుచును నడువగ నవనీశసుతులు
ఘనవృషసేనుండు కలుషభంజనుడు
చెలగి సాందీపుండు చిత్రాంగదుండు
బలభద్రు డాదిగా పార్థివోత్తములు
దగ నాయుధమ్ములు దాల్చి ముదమొప్ప
మొనసియు యువరాజు ముందర నడువ
కదిసి వర్జ్యన్యుండు కార్తికేయుండు
సులభుండు రంభుండు సోమశేఖరుడు
ప్రబల సైన్యముతోడ పార్వ్శభాగముల
పదునాల్గువేలు నిర్భరవృత్తి నడువ
మాధవుండరుదెంచి 'మహనంది' చేరి
సాధుజనరక్షణోత్సాహియై మెఱసి
సిరిదేవి శిఖరంబు చెచ్చెర నెక్కి
యరుదెంచె హరియందు నతివ లెల్లరును
మహిమాస్పదుండగు మాధవు గొలువ
సహజభక్తిని నమస్కారంబు చేసి
విందు గావింప గోవిందు డావేళ
కందర్పవైరిని కరుణ మన్నించి
వెడలి మార్గంబున విముఖు గావించి
ఫణిఘోటకము మారువడి తటాయించి
కరవాలధారను ఖండించివైచి
ధరణి గంపింప దుస్తరమార్గములను
సాధించి శక్తుల జవమెల్ల మానిపి
తత్వభేదుల షణ్మతస్థుల బిల్చి
కొందఱి నుగ్గాడి కొందఱి నొంచి
కొందఱి కొరడాల గొట్టి హుంకించి
కొందఱి దూషించి కొందఱి మోది
కొందఱి గుండెలు గుడ్లు దీయించి
చిందరవందర చేసి సాధించి
అందఱి దనభక్తు లగునట్లు చేసి
నందేల కరుదెంచి నడురాత్రియందు
తడయక దైత్యుల తాళ్ళప్డు తెంచి
వడివడి నామార్గవర్ణ సంకరము
చెడిపోవుచున్నట్టి చెనటుల బట్టి
వడిగ బొట్టలు చీల్చి వైరముల్ వాపి
సిరులెల్ల కోనాల సీమలయందు
పరిపరివిధముల భక్తులు గాంచి
కడుదుర్గముల తాను గైకొని కదలి
యుడుగక వెడలి యహోబిళంబునకు
చనుదెంచి నరహరిస్వామిని గాంచి
పనిబూని యాకర్లపాలెంబు కరిగి
మయునిచే పూజ లిమ్మడి గాంచి మించి
నయ మొప్ప నట దినత్రయ మున్నవెనుక
కపిలమునీంద్రు నాకర్షించి యున్న
విపులమున్నెల్లికి వేవేగ కదలి
కలహచూతపురంబు గైకొని కదలి
చండిచెర్లకుచేరి సర్వేశ్వరుండు
అందు భక్తులతోడ నరసి మన్నించి
ఘను డించినగరంబు గాంచి సంబాక
యను నగరంబును నరసి భక్తులను
వీక్షించి యాకృష్ణవేణి దర్శించి
అక్షీణమౌ బలాయతశక్తి మరలి
కలధనంబుల నన్నికడల శోధించి
వెడలంగ కుశలవవిభుని కైవసము
గావించి భక్తుల కిమ్ము ఖర్చునకు
శ్రీలను వెలయగా జేసి తత్సుతుడు
నెమలిగూడెమునకు నృపు డేగుదెంచి
రమణి దోడ్కొనివచ్చి రహి పరోక్షునకు
వరములు గావించి వైళంబు గదలి
నరులెన్న భుసురనగరంబుసకును
నరుదెంచి మృగశిరయను తలోదరిని
ఎందున్న దనవుడు ఈశ్వరు డనియె
అందఱు కుసుమాద్రియం దున్నవార
కేశవస్వామి సంకేతంబు తోడ
నందుండి మాధవుం డరిగి సలలిత
కపిలునిస్థానంబు గాంచి వెలయంగ
నారాత్రి నిద్రించి యా మఱునాడు
పాళెంబు వీక్షించి వరుస నామీద
గిరిధరుండును పుష్పగిరి చేరె నంత
శ్రీరమాధీశు డాశ్రితవత్సలుండు
కారణకార్యసంకల్ప మూహించి
సకల దిక్పతులును సన్మునీశ్వరులు
సకలభక్తజనాళి సందడి గొల్వ
మనుమయత్వష్టాదిమంత్రిపుంగవులు
ననుమతి భావికార్యము విచారించి
తన తనూభవుని అద్భుతభుజాబలుని
గని కుశలవులను గావించు క్రమము
సకలమౌ భావలక్షణములు దెలిసి
మంగళస్నానసమగ్రానురాగ
సంగతి దీక్షా విచక్షణంబులకు
సమయ మేర్పడ బొందు శ్రావణశుద్
ధ ప్రథిత షష్ఠి ని భృగువాసరంబునను
మంచి దటంచును మయు డెఱిగించె
పంచమి తిథిని దిక్పతుల భార్యలును
సుతబంధుహితజనస్తోమంబుతోడ
మతిమంతులై నట్టి మంత్రులతోడ
ప్రకటితభూషణాంబరములతోడ
సకలవైభవముల జనుదేర వలయు
రప్పించు మనవుడు రాజనందనుడు
నప్పుడు నాసుమంతావవినాథు
కనుగొని సెలవిచ్చి కమలోదరుండు
మనమున నూహించి మన పరోక్షుండు
ఘను డతం డిట కార్యఘటన గావించు
ఘనభుజాబలుడు సంక్రందనుం డతుల
తేజంబుచే మహాదేవసన్నిభుడు
రాజసింహుడు నృపరాజభూషణుడు
వాలాయముగ దైత్యవర్గంబునకును
కాలమృత్యువునైన కాలభైరవుడు
కపిలమహాముని కరుణ గైకొన్న
విపులమానసుడు వివేకభూషణుడు
నీ వెఱుగవు వాని నిజమహత్త్వంబు
దేవదేవుడు విష్ణుదేవు డెఱుంగు
ఏ నెఱుంగుదు కొంత వినిపింతు వినుము
వానిజన్మస్థితి వాడు పూర్వమున
మూడుమూర్తుల తపంబునను మెప్పించి
వాడు గైకొనె దివ్యవరములు మున్ను
కాలకంఠుని నైన కమలాక్షునైన
కాళికాభవునైన కమలాక్షునైన
ప్రమథులనైన దిక్పాలురనైన
సమయోచితంబుగ సాధింపగలడు
గిరివర దైత్యుందు కృత యుగంబునను
వరయుతంబుగ ప్రజాపతి అంశయందు
వీరనందీశుదై వీడుద్భవించె
సంగతి తనతల్లి చనిచ్చి వీని
పృథివిపై కూర్చుండ బెట్టిన వెంట
మధుసూదనుని తన మదిలోన దలచి
తనరంగ సప్పుడు తల్లిదండ్రులకును
కనుమ వీడుచును బంగరుకొండ కరిగి
కడు భక్తి నాకాశగంగలో మునిగి
తడయక స్నానకృత్యము లెల్ల దీర్చి
చనుదెంచి కాంచన శైలాగ్ర మెక్కి
గొనకొన్నవేడతో కొండనెత్తమున
నొకకాలు పాదుగా నునిచి వేగంబె
అకలంకమౌ ద్వితీయాంఘ్రియు నెత్తి
హరి కిరణంబులె అశనంబు గాగ
బరికించి యల ఊర్థ్వబాహుడై నిగిడి
యోజనాయుత రూప మొయ్యన దాల్చి
తేజంబు దశదిశల్ తెరగొప్ప నిండ
చలనంబు మాని నిశ్చలచిత్తు డగుచు
బరగంగ రోషాదిపటలి వర్జించి
పవనుని బంధించి పంచేంద్రియముల
మదమణిగించి నిర్మలబుద్ధిలతకు
మారాకు హత్తించి మఱి రేచకంబు
పూరక కుంభకస్ఫురణ గావించి
పదవిజృంభణను దుర్వారకుండలిని
నడివీథి బెకలించి నడినాళరంధ్ర
వివరంబు చెలగించి విడువక నిక్కి
కుడియెడమలను మార్కొని తటాయించి
ప్రళయకాలాభీల పటుబడబాగ్ని
కలయబట్టిన చేటకన్ను సంధించి
సకలప్రపంచంబు సర్వదా మిథ్య
అక లంక గతి గూడి హరి గూర్చి తపము
గావింప లోకము గడ గడ వడకె
దేవతల్భీతిల్లి ధృతి తల్లడిల్లి
హరితోడ నెఱిగింప నత డేగుదెంచి
పరికించి శతదివ్య వత్సరంబులకు
నీయుగ్రతపమున నేను మెచ్చితిని
ధీయుక్తి వేడుము దివ్యవరంబు
అనిన కేశవుభవత్కారుడా వేళ
జనులెన్న దేవర సన్నిధియందు
నకల కారణ ప్రయోజనముల యందు
సక లంక పతి యగునట్లుగా నాకు
వరమిమ్ము. వేరొక్క వర మొల్ల ననిన
పరిపూర్ణ కృప చేత వర మిచ్చెతొల్లి
అది కారణంబున నవనిపై వీడు
విదితంబుగా నిప్పుడుదయించె నంచు
ఉల్లంబు రంజిల్ల నుత్సవవేళ
తల్లియైనట్టి సీతాదేవి నాకు
వినిపించుటయు జేసి వీని జన్మంబు
కనుగొంటి నయ్య అఖండవిక్రముడు
నీమది మర్త్యుగా నిర్ణయింపకుము
స్వామి కార్యము వీడు సాధింపగలడు
అది యీ పరోక్షుని అవతార మహిమ
దేవతాకార్యంబు దీవించు మిపుడ
తపసులకైన దుస్తరము నీ యాత్మ
అని తోడుకొని వచ్చి యధిపతి యెదుట
నునిచిన కుశలపు డుత్సాహ మంది
బంగరు పచ్చల పల్లకి యొసగి
బంగారుభూషణాంబరము లొసంగి
అనఘాత్మ చెన్నమాంబాదిగా గలుగు
వనితలతో నీవు వైళంబు రమ్ము
పొమ్మన కుశలవభూపాలునకును
సమ్మతితోనమస్కారంబు సలిపి
తత్‌వైభవంబున దనయింటి కేగి
యతివల కవ్విధం బంతయు దెలిపి
సతులతో హితులతోచనుదెంచె నంత
కపిలమునీంద్రుని గని యువరాజు
తపసుల భక్తసంతతుల రావించి
తారకాక్షాది దుస్తరదైత్యతతుల
వారి బంధువులతోవారి రప్పించి
లోగడ వెలిగడ లోనుగా జనిన
వేవేగ తోడ్తోడ విబుధుల బిలిచి
వెలయంగ నొకరిని వెలితి గాకుండ
కలయంగ నాల్గుయుగంబులనుండి
యున్నట్టివారల నొనర వేర్వేర
తరుణుల పుత్రమిత్రాదిసంతతుల
పదికోట్ల దేవతాభటులను బలిచి
తడ వాలసించిన దండింతు ననుచు
నడరి పరోక్షుండు నలువతో పలికె
ధర వియత్తల రసాతలముల కరిగి
నటు పరోక్షుని శీల మంతయు చెప్పి
నీపుత్రపౌత్రుల నీబంధుజనుల
నీపత్నులం గూడి నీవు రమ్మనుచు
పదపదం డని మహాభక్తులు కదల
సకలలోకనివాససంఘంబు లపుడు
అకలంకభక్తితో నధికోత్సవములు
ఎన్నాళ్ళకిచ్చె మా కిహము వరమ్ము
కన్నులపండువుగా జూతు మనుచు
వీరధర్మజుని భూవిభుని నందనుని
వీరధర్మజు నాగవిభుడు పరోక్ష
వీరుల జూచి సందేహింప వలదు
అన వలె నని వాడు హరి యాజ్ఞ వడసి
మాన్యుల రావించి మునుల రావించి
కపిలమునీంద్రుని గని కేలు మొగిచి
తపము ఫలించి నీతలపట్టులుండె
నాలస్య మింకేల అటుసేయుడనిన
పోలిచి శిష్యుని బుద్ధికి మెచ్చి
శతయోజనముల విశాలమైనట్టి
కుదురౌ త్రికోణంపు కుండాతరమున
ననలు ప్రతిష్ఠించి అమ్మునివరులు
కొమరార నయ్యగ్నికుండమధ్యమున
వలనొప్పనాహుతుల్ వహ్ని కర్పింప
చెలరేగి దహనుండు చిటపటార్భటుల
పటుతరబ్రహ్మాండభాండముల్ పగుల
పెటపెట మని గిరుల్ బెగ్గిలి నిగుడ
భుగభుగమంటలు భూనభోంతరము
అగణితస్ఫూర్తిమై అందు దనర్ప
దశదిశల్ నిండి ఉదగ్రత సాగి
వితతమై నెఱి మంటవితతి బిట్టెగసి
అటు సూర్య చంద్రపథావళి కెగసి
కడువడి సత్యలోకంబును గడిచి
తుదితుది మండ వీథులు సాగిసాగి
కడువడి దగ నాలుకలు కోసికోసి
భయపడ నొప్పారె పటుజవోన్నతుల
ఘోటకారూఢుడై గోవిందు డపుడు
గాటంపుఖడ్గ ముగ్రంబుగా బూని
పరిపూర్ణకృపతోడ భక్తజనాళి
జయజయశబ్దముల్ సజ్జనుల్ పలుక
రూడిగా తనకుమారుల కిట్టు లనియె
మంగళ స్నానముల్ మరి చేయవలయు
సంగతుల్ దొరసి నిశ్చలవృత్తి బూని
కావింపు మనవుడు కరముల మొగిచి
శతమఖు డనలుండు శమనుండు నిరృతి
తడయక యావరణుడు పవనుండు
యక్షాధిపతియు నీశానుండు వారి
సతులతో హితులతో చటుల మంత్రులతొ
సేనాధిపతులతో చయ్యన వచ్చి
పదియారుకోటుల పది రెండు వేలు
వదలక రాజుతో వహ్నిలోపడిరి
అనలుండు బ్రహ్మాండ మంది మండగను
కుశలవపతి గని వహ్నియ జడిసి
హరికుమారుండు వీడలవిగా డనుచు
గరిమ కృశానుండు కడుచల్ల నయ్యె
జలధిలోపల నీదు చందంబు తోచె
సలలితకుశలవక్ష్మావల్లభుండు
సకలమంత్రంబులు శౌరిసత్కృపను
అకలంకముగ పదియారు ఘడియలను
ఆకుండ మధ్యంబునం దుండ వారు
బాగొప్ప వీక్షించి పద్మలోచనుడు
వలనొప్ప నీతి దివ్యజ్ఞానదృష్టి
కులశీలదాక్షిణ్యగుణవయోధర్మ
ములు నీతిమార్గముల్ మూడుమూర్తులకు
నలవిగానట్టి మహామహత్త్వములు
శతసహస్రములు లక్షలు కోటివేలు
ప్రతిలేని ఖర్వముల్ పద్మసద్మములు
మదనసుందరులైన మానినీమణులు
సదమల పతిభక్తి నత్యున్నతులను
పరిపూర్ణ సత్కళాభావుల జేసి
జలజాక్షు డరు దెంచె సత్కుమారకుని
ఆలింగనముచేసి యాసుమంతాది
శీలవంతుల కటాక్షించి వేవేగ
నందఱ దోడ్కొని హరిసంతసమున
సందడింపుచు దన సతులును దాను
చనుదెంచె రచ్చటి సన్నతుల్ మెచ్చ
శ్రీవీరధర్మజస్వామి విజయము
మహిమభారతి చెప్పమఱి భవిష్యంబు
విన్నవించెద నేను విశదంబుగాను
చెన్నొంద వినరయ్య చెవులపండువుగ
కమలాలయనుగూడి కమలనాభుండు
రమణీమణిని గూడి రామధర్మజులు
కదలివచ్చెడు జూడ కలికిరూపమున
ముదమందుచుండును మూడులోకములు
నలువంక రథములు నాలుగుకోట్లు
పదునెనిమిదికోట్లు భటవీరవరులు
పదములు పాడుచు పద్మినీస్త్రీలు
ముప్పదిముక్కోట్ల మూకలతోను
వీరగురుడు వచ్చి యానందముగను
ముత్యాలఛత్రముల్ ముందర గొలువ
సత్వాత్ము లది చూచి సంభ్రమించెదరు
భేరి వేయించేరు భీకరంబుగను
ధారుణిలో ప్రజల్ తల్ల డిల్లగను
భానునందికి వచ్చు భక్తవత్సలుడు
భానుమండలపతి పాలించు జగము
అటమున్న వీరభోజాదినాయకులు
కృతయుగ ధర్మపద్ధతి నడిపింప
అమలనాగస్థలమందున దివ్య
యోగ మార్గంబున యోగీంద్రు లెల్ల
నొసగ దివ్యాస్త్రంబు లొగి వాని నంది
వసతిగా పదునాల్గు వర్షంబు లచట
చనిన పిమ్మట నాదిశక్తిని పంపు
తామసంబునను చింతన చేయ నరులు
కాలజ్ఞు లొనరించు గతి కానలేక
మూలంబు తెలియక మూర్ఖులై నరులు
గురు ధర్మములు లేక కుటిలమానవులు
తిరిగుచుందురు దివ్య దేశంబులన్ని
చెడిపోవువారల చేపట్ట లేక
గడచిపోవుదు రనుకంపయు లేక
మారిపంపున కొంతమంది మడియుదురు
పాతిక పాలు భూప్రజ సత్యజనులు
నియతిజ్ఞు లెల్లరు నిలిచియుండెదరు
తామసం బెడలించి తగ దినకరుడు
క్రమమున నుదయించు గతి వీరభోజు
డమిత తేజంబున నానందమునను
ప్రమదతోడుత రాజ్య భారంబు బూని
కృతయుగ ధర్మాలు కీర్తింప కవులు
శతదశసంఖ్యవర్షాలు పాలించు
****